ఇలాగైతే ఎన్ని పరుగులు చేసినా వేస్ట్‌!

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో తొలి టీ-20లో వీరోచితంగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు రెండో టీ-20లో షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలోని జరిగిన రెండో టీ-20లో భారత్‌ విసిరిన 171 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్‌ జట్టు అలవోకగా ఛేదించింది. 1.3 మూడు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించి.. భారత్‌తో వరుసగా ఏడు పరాజయాల అనంతరం విజయాన్ని చవిచూసింది. అంతేకాకుండా మూడు సిరీస్‌ను 1-1తో  సమం చేసి.. తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయానికి చెత్త ఫీల్డింగ్‌ ప్రధాన కారణం. విండీస్‌ ఓపెనర్లు సిమన్స్, లూయిస్‌ ఇచ్చిన క్యాచ్‌లను ఓకే ఓవర్‌లో నేలపాలు చేయడం టీమిండియాను గట్టిగా దెబ్బతీసింది. ఐదో ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద విండీస్‌ ఓపెనర్‌ సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ వదిలేశాడు. అనంతరం 17 పరుగుల వద్ద ఎల్విన్‌ లూయిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను రిషబ్‌ పంత్‌ జారవిడిచాడు. దీంతో లైఫ్‌ పొందిన సిమన్స్‌ అజేయంగా 67 పరుగులు చేయగా.. లెవిస్‌ 40 పరుగులు చేసి లక్ష్యఛేదనను అలవోకగా మార్చేశాడు.